Saturday, 20 August 2016

ప్రశ్నలు - 1

శుభం.
మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానములు

౧ ప్రతిమంత్రానికి బీజం, శక్తి, కీలకం ఉంటాయని విన్నాను. ఈ మూడిటి స్వరూపం ఏమిటి? వీటిమధ్య భేదమేమిటి? ఏదేమిటో ఎలా తెలుస్తుంది? బీజశక్తికీలకాలు తెలియకపోవటం సాధకుని బాధిస్తుందా?

దీని గురించి ఇంతకు ముందే చెప్పడం జరిగినది. 
కారణ బిందువు నుండి ౧) కార్య బిందువు, ౨) అందుండి నాదము ౩) అందుండి బీజము అను మూడు పుట్టు చున్నవి. ఈ మూడును పర, స్థూల, సూక్ష్మ పదముల చే చెప్పబడు చున్నవి. కాబట్టి బిందువు స్థూల, సూక్ష్మ, పరమని మూడు విధములుగా చెప్ప బడుచున్నవి. బిందువు గురించి తెలిస్తే బీజము గురించి తెల్సినట్లే.  బిందువే బీజమునకు  మూలము.. ఇవన్నీ అతి రహస్యములు గురు-శిష్య పర౦పర ద్వారా తెలుసుకోదగిన విషయములు. ఉపాసన, ఉపదేశం లేని వారికి ఈ బీజ శక్తి కీలకములు లేకుండా చేయడం ఉత్తమం. బీజ సహితముగా చేయడం వలన తొందరగా మంత్రము సిద్దించును. బీజ రహితముగా చేసినందువలన సాధకునికి ఎటువంటి ఇబ్బంది లేదు, వచ్చే ప్రమాదము లేదు. పట్టు తొందరగా కుదరదు అంతే. బీజ శక్తి కీలకములను ఉపదేశము ద్వారా, దీక్ష ద్వారా గురువులు తమ శిష్యులకు మంత్రమును ఇచ్చెదరు. అప్పుడే అది పరి పూర్ణము అగును. దాని శక్తి అమోఘము. అర్హత లేని వారికి ఇలా బీజ రహిత మంత్రములను ఇచ్చెదరు. ఇది గురువులు తమ శిష్యులను పరీక్షించి, వారి స్థాయిని బట్టి ఇచ్చెదరు. అందుకే సద్గురువులు కావలెను అని అందురు.

౨ ఉదాహరణకు తీసుకుంటే శ్రీరామరక్షాస్తోత్రానికి సీత శక్తి, హనుమంతుడు కీలకం అంటారు. బీజం చెప్పలేదు. అలాంటప్పుడు బీజమేమిటో ఎలా తెలిసేది? సాధనద్వారా మాత్రమే తెలిసే విషయాలా ఇవి?

అంతర్లీనంగా, అంతర్గతముగా రామ బీజము ఇందులో కలదు. ప్రకటితముగా చెప్పబడలేదు. కానీ ప్రాచీన హిందీ, సంస్కృత ప్రతులలో బీజము చెప్పబడివున్నది.
ఇది కూడా మంత్ర రహస్యమును కాపాడ దానికే పెద్దలు, గురువులు ఇలా చేస్తూ వుంటారు. గురు ముఖ:ముగా వచ్చినప్పడు మంత్రముగానీ, స్తోత్రము గానీ పూర్తి స్థాయిలో చెప్పబడుతుంది. లేదంటే అన్యుల చేతికి దొరికినప్పుడు చాలా ప్రమాదము సంభవించును. ఇవన్నీ formula లాంటివి. బ్రహ్మాస్త్రముల formula ఇతరులకు దొరకకూడదు. దాని వలన చాలా అనర్ధములు కలుగును. అందుచేత మన ఋషులు చాలా గుప్తముగా ఉంచినారు మంత్ర శాస్త్రమును.
తారక మంత్రము ఏక బీజాక్షరము. బీజాక్షరములలో ఏకము చాలా శక్తిమంతమైనది. దానిని తట్టుకోవడము చాలా కష్టము. అందు చేత దాని శక్తిని తగ్గించడానికి మరి రెండు మూడు బీజాక్షరములను సంపుటీకారణము చేసి మంత్రమును ఇచ్చెదరు.
రామ మంత్రమునకు బీజము రాం. అదే తారకము, వాల్మీకి, మారుతి జపించినది  ఈ బీజాక్షరమునే. మహా శక్తివంతమైనది ఈ రాం బీజము. అతి గుహ్యమైనది. ఉపదేశము లేకుండా బీజాక్షరములు చేయకూడదు. తట్టుకొనే శక్తి లేకపోతే ప్రమాదము. Mind un balance అవుతుంది. అంతర్లీనంగా శ్రీ రామ రక్షా స్తోత్రములో గలదు. సాధన చేత, ఉపాసన చేత, గురువుల అనుగ్రహము చేత దీనిని దర్శించ వలెను.

౩ మంత్రానికి ఉండే బీజశక్తికీలకాలకూ స్తోత్రానికి ఉండే బీజశక్తికీలకాలకూ భేదముందా?

దేనికి దానికి వేరుగా వుంటాయి. మంత్ర మంత్రమునకు ఇవి మారుతూ వుంటాయి. అలాగే స్తోత్రమునకు కూడా. అవి వేరు ఇవి వేరు.

౪ మంత్రాలలో కూడా మంత్రమనీ, మహామంత్రమనీ, మాలామంత్రమనీ ... ఈ భేదాలేమిటి?

అన్నింటినీ మంత్రములు అని అందురు. 24 అక్షరముల కంటే ఎక్కువ వున్న మంత్రములను, మరియు మోక్ష మంత్రములను ...మహా మంత్రములు అని అందురు.
మాలా మంత్రము అంటే కొన్ని వాఖ్యములు కోన సాగే మంత్రములను మాలా మంత్రములు అని అందురు. దండలాగా వుంటుంది. దీనికి ఉదాహరణలు నేను తరువాత చెబుతాను. ప్రత్యన్గిరా, చండీ, బగళ మంత్రములకు ఇలా మాలా మంత్రములు గలవు.

౫ మీరు చెప్పిన దుర్గాచండీమహామంత్రమంటే దుర్గాసప్తశతి అనా?

దుర్గా చండీ సప్తశతి యొక్క మూల మంత్రము చండీ మంత్రము అని అందురు. దీనినే కొంత సంపుటీకరణముతో, బేధముతో మహా చండీ కూడా గలదు.
చండీ మంత్ర ఉపదేశము లేనిదే చండీ సప్తశతి, (దుర్గా సప్తశతి) చేయకూడదు. మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి యొక్క త్రిశక్తి స్వరూపమే చండీ స్వరూపము.

౬ నాదబిందుకళలంటారు. అవేమిటి?

ఇది శ్రీవిద్యలో చెప్పబడుతుంది. ఇతరులకు చెప్పకూడదు. గురు ముఖ:త తెల్సుకోవలెను. కొన్ని విషయములను బహిరంగముగా చెప్పకూడదు. చాలా ప్రమాదము. సరిగా అర్ధము చేసుకోలేరు. భావన తప్పు వస్తుంది. ముందు నాదం అర్ధం చేసుకో. అవతల వాటి కళలు గురించి తెలుసుకొనేదవూ. ప్రకృతిని ఆరాధించడం తెలుసుకో. ప్రకృతిని అధ్యయనం చేయి.

మంత్ర శాస్త్రములో కొన్ని విషయములను ఎవరకి వారు సాధన ద్వారా తెలుసుకోవలెను. ఇతరులు చెబితే అర్ధము గాదు. మెలుకవులు గురువులు చెప్పుదురు.
దారి గురువులు చూపించేదారు, నడవ వలసినది మనము. మనము వెళ్లి తెలుసుకోవాలి.

మీ
శ్రీ భాస్కరానంద నాథ
శ్రీవిద్యా పూర్ణదీక్షాపరులు..

No comments:

Post a Comment