Thursday 20 November 2014

వివాహములు – ప్రేమ వివాహములు – పునర్వివాహములు - 1

వివాహములు – ప్రేమ వివాహములు – పునర్వివాహములు - 1

ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలలో ఒకటైన కామాన్ని, ధర్మ బద్ధం చేయడానికి పెద్దలు, ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం. ధర్మం ప్రాతిపదికగా, అర్థం-కామం సాధించడానికి భారతీయ హిందూ సాంప్రదాయ మూల సూత్రంగా రూపొందించిన విధానం "వివాహం".
పుత్రతే క్రియతే భార్యా”.... వివాహము పుత్ర సంతానము కొరకు. వంశము నిలపడానికి వివాహము అని అన్నారు.  
వివాహము సంతానము కొరకే గాని, భోగము కొరకు మాత్రము కాదు అని మన ఆర్ష ధర్మము చెబుతున్నది.
“వివాహో ప్రజాయై, నతు భోగాయేతి  మహాత్మనో మతం”....అని సిద్ధాంతం. పున్నామ నరకము నుండి ఉద్దరింపు వాడు గాన పుత్రుడు అని అన్నారు. అటువంటి పుత్రుని కోసం వివాహం.
జీవితంలో వివాహం అత్యంత ప్రధాన విషయం. ఏ వయసులో వివాహం, ఎప్పుడు జరుగుతుంది ? సుఖ ప్రదంగా ఉంటుందా? అన్యోన్యత ఉంటుందా? అనురాగం ఉంటుందా? సంతానం ఉంటుందా? ఎడబాటు వుంటే ఎన్నాళ్ళు సాగుతుంది ? ఎప్పటికైనా ఒకరికొకరు దగ్గరయ్యే అవకాశం ఉందా? లేక విడాకుల వరకు వెలుతుందా?
వివాహము ఎక్కడ? ఎవరితో దగ్గర సంబంధమా? దూర సంబంధమా? సాంప్రదాయ వివాహమా? ప్రేమ వివాహమా? ప్రేమ ఫలిస్తుందా? మోసగింప బడతారా? విడాకులు వస్తాయా ? పునర్వివాహమా ? అది ఫలిస్తుందా?
ఇటువంటి అనేక ఆసక్తికర విషయములు జ్యోతిష శాస్త్ర సమన్వయముతో చక్కగా తెలుసుకొని తగు జాగ్రత్తలు మంచి జ్యోతిష్కుని ద్వారా తెలుసుకోవచ్చును.
ఇందులో ప్రేమ వివాహములు జరిపించేది, మనసును చెడ గొట్టేది పాప గ్రహములు, అందులో ముఖ్యముగా ప్రధాన పాత్ర పోషించేది రాహు. రాహు కేతు గ్రహములు ఛాయా గ్రహములు అయిననూ కళత్ర భావము పై చాలా ప్రభావము చూపి పతనావస్థకు చేర్చుతాడు. అవమాన పాలు చేస్తాడు. మూడు నాలుగు వివాహములు చేస్తాడు, నమ్మించి మోసం చేస్తాడు, వర్ణాంతర, కులాంతర వివాహములు చేయిపిస్తాడు, నీచ స్త్రీలతో సహవాసం చేయిపిస్తాడు.

 భార్య వుండగా, భర్త వుండగా అక్రమ సంబంధములను కలిపిస్తాడు, పర స్త్రీల యందు ఆరాటం, ఆసక్తి, వంచించడం, నైతిక విలువలు పాటించక పోవడం, యజమాని భార్యను, గురు పత్నిని వాంచించడం, స్త్రీ విషయం లో నియమాలకు తిలోదకాలు ఇవ్వడం, అడ్డు వచ్చిన వారిని బెదించడం, చంపడం, భార్య వుండగా వంట మనిషితో, పని మనిషితో సంబంధాలు, వెధవ చేష్టలు చేయడం, భార్యను అమానుషంగా హింసించడం, అతి క్రూరంగా, శాడిస్టు లాగ ప్రవర్తించడం, భార్యను కాల్చుకొని తినడం లాంటివి చేస్తాడు.  ఆత్మహత్యలకు పాల్పడుతారు,  భార్యలైతే భర్తలను ఏడిపించుకొని తిని, బజారుకు ఈడుస్తారు.   

క్షుద్ర మాయా మంత్రములను ఉపాసించడం, ప్రయోగించడం, కుట్ర కుతంత్రములకు తావివ్వడం ఇలాంటి పనులకు రాహువు కారణం. అదే రాహువు మంచి స్థానములలో వుంటే వైద్య వృత్తి లో బాగా రాణిస్తారు.
మిగతా విషయములు రేపు తెలుసుకొంటాము. స్వస్తి.
మీ
భాస్కరానందనాథ

20-11-2014

Sunday 14 September 2014

గరుడ పురాణం – భగవంతుడి శిక్షాస్మృతి
మానవునికి శాశ్వతమైన శ్రేయస్సును, దానికి మార్గమును తెల్పు గ్రంథములు వేదములు. అవి అపౌరుషేయములు, వాటి అర్ధములను అందు ప్రతిపాదింపబడిన ధర్మములను సులభముగా తెలుసుకోనుటకై ఇతిహాస పురాణములు వెలువడినవి. ఆ పురాణములను ప్రతి ఒక్కరూ తప్పక చదివి ధర్మాధర్మములను, పాప పుణ్యములను  తెలుసు కొనవలయును. శాస్త్రము ననుసరించి మానవుడు నడుచుకోనవలెను. ఆ శాస్త్రమును గురించి చెప్పు వాడ్ని శాస్త్రి అని అందురు.
అష్టాదశ పురాణములలో ఒకటి గరుడ పురాణము.  ఈ గరుడ పురాణము శ్రీ మహావిష్ణువు చేత గరుత్మంతునికి ఉపదేశింపబడినది. విష్ణు ఆరాధన, తులసీ మహాత్మ్యము, ఏకాదశి వ్రత విధి, నామ మహిమ, సదాచార విధానము మొదలగు పెక్కు విషయములు ఇందు చెప్ప బడినవి.
గరుడ పురాణం అనేది మనిషిని సన్మార్గంలో నడిపించడానికి మన పెద్దలు వ్రాసిన ఒక మహత్తరమైన గ్రంథం. దీనిని చదవడంవల్ల మనిషి తన జీవితాన్ని మంచి మార్గంలోకి మలచు కోవడానికి ప్రయత్నిస్తాడు.
అష్టాదశ పురాణాల్లో గరుడ పురాణానికి ఎంతో ప్రత్యేకత వుంది ... మరెంతో ప్రాధాన్యత వుంది. అయితే మిగతా పురాణాలు చదివినంత తేలికగా ... ఆసక్తిగా గరుడపురాణం చదవడానికి చాలామంది ఇష్టపడరు. అందుకు కారణం గరుడపురాణం పట్ల వారికి గల అపోహేనని చెప్పవచ్చు. ఏదో చెప్పనలవి కాని భయము, అపోహ. మరణించినప్పుడు మాత్రమే చదువ వలెను అని, ఇతర రోజులలో చదువకూడదు అని అపోహ, అశుభం అని కొందరి భయము. ఇది తప్పు. ప్రతి ఒక్కరూ చదువ వచ్చును. తల్లిదండ్రులు వున్నవారు మాత్రము ఇందులోని అంత్యేష్టి విధానము చదువ కూడదు. మిగతా అన్ని విషయములు చదువ వచ్చును, తప్పక చదివి తెలుసుకోవలయును. ఈ పురాణము అందరి ఇండ్లల్లో ఉండవచ్చును. గరుడ పురాణమును అందరూ నిరభ్యంతరముగా చదువ వచ్చును అని శ్రీ మల్లాది చంద్ర శేఖర శాస్త్రి గారు చెప్పి యున్నారు. ఈ పురాణమును బ్రాహ్మణులకు దానము చేయుట చాలా విశేషము.
ఈ పురాణంలోని విషయాలు గరుత్మంతుడి సందేహాలను తీర్చడానికి శ్రీమహావిష్ణువు చెప్పే సమాధానాలుగా కనిపిస్తాయి. దేహాన్ని వదిలిన అనంతరం ఆత్మ ప్రయాణం ... జీవికి ఎదురయ్యే పరిస్థితులు ఈ పురాణంలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఈ కారణంగా కొన్ని ప్రాంతాల్లో ... కొన్ని కుటుంబాల్లో శ్రార్ధ సమయాల్లో గరుడ పురాణం చదవడం ఆనవాయతీగా వస్తోంది.  జీవుడి ప్రయాణం, జీవుడి కర్మ, పాప పుణ్యములు, యాతనా శరీరం, యమపురి, చావు పుట్టుకలు, అంత్యేష్టి విధానము, పునర్జన్మ, రోగములు, వ్యాధులు, దానములు ఇవన్నీ తేటతెల్లముగా చెప్పబడినవి. జీవుడు ఉత్తమ జన్మలు పొందాలంటే ఏమి చేయాలి, కర్మ, జన్మ, పాపము, పుణ్యము, రోగాలు, ప్రమాదాలు ఇలా ఎన్నో ఆశక్తి కరమైన విషయములు తెలుసుకో వచ్చును. తల్లి దండ్రులు వున్న వారు ప్రేత కల్పం తప్పించి మిగతా అన్ని విషయములు, అన్ని అధ్యాయములు  అందరూ చదువ వచ్చును.
 మీ
భాస్కరానంద నాథ /14-09-2014/SRI KALAHASTHI.  

Thursday 11 September 2014

అనాయాస మరణము – ఆయాస మరణము

అనాయాస మరణము – ఆయాస మరణము

మంత్రేశ్వర ఫలదీపికాయాం – చతుర్ధశోz ధ్యాయే – శ్లోకం -21 

సౌమ్యాంశకే సౌమ్య గృహేzధ సౌమ్య సంబంధ గే వా క్షయ భేక్షయేశే
అక్లేశ జాతం మరణం నరాణాం వ్యస్తే తధా క్రూర మృతిం వదంతి.

అను ప్రమాణము వల్ల క్షయ భావము గానీ, క్షయాధిపతి గానీ సౌమ్యులయిన పూర్ణ చంద్ర, బుధ, గురు, శుక్ర గ్రహముల సంయోగ విలోక నాధులు పొందినప్పుడు గానీ, క్షయ స్థానమున వున్నప్పుడు గానీ సునాయాస మరణము మానవులకు కలుగును.
మోక్ష స్థానమున యుక్తులుగా శుభులు యున్న ముక్తియు కలుగును. ముక్తి యందు పాపులున్నను ముక్తి విహీనుండు యిలలో ముదముగ రామా ||
ఈ విధముగా క్షయ భావ మనగా పన్నెండవ యిల్లు, ఇదియే మోక్ష స్థానము, వ్యయ స్థానము రెండునూ. ఇట్టి వ్యయాధిపతి పాపుడాయి శుభ సంయోగ విలోక నాధులు లేనప్పుడు ప్రబల పాప సంయోగ విలోకనాదులు పొందినప్పుడు దీర్ఘ కాల రోగ మరణములు, ఆయాస మరణములు, సమూహ మరణములు, అగ్ని మరణములు, జల మరణములు, ప్రబల శత్రువుల చే చిత్రవధతో కూడిన పలు విధములగు దుర్మరణములు  పాపులకు సంభవించును వారి వారి పూర్వ కర్మాను సారముగాను.
కనీసము వ్యయాధి పతి, అంశయందైనను శుభ క్షేత్ర, శుభ సంయోగములను పొందిన గాని అనాయాస మరణము కలుగదు. ప్రబల పాప స్థితి సంయోగ విలోక నాధుల చేత రైలు ప్రమాదములు, విమాన ప్రమాదములు, ఓడ ప్రమాదములు, కారు, సైకిలు ప్రమాదములు, బండ్ల ప్రమాదములు కలుగును.
జాతక చక్రము లోని దోషములను తెలుసుకొని, ఆయా గ్రహములకు శాంతి చేయించుకొని, ఇష్ట దేవతారాధన మరియు గురువును ప్రార్ధించ వలయును. గురువు ఒక్కడే అన్ని ప్రమాదముల నుంచి కాపాడ గలడు.


మీ 
శ్రీ భాస్కరానంద నాథ /12-09-2014

Sunday 24 August 2014

పాపం – ప్రాయశ్చిత్తం – పశ్చాతాపం

పాపం – ప్రాయశ్చిత్తం – పశ్చాతాపం
పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితాం... పూర్వ జన్మలో మనం చేసిన పాపం రోగం రూపములో అనుభవములోనికి వస్తుంది అని శాస్త్ర వచనము. పూర్వ జన్మలో మనము చేసిన పాప పుణ్యములను బట్టి మన జన్మ వుంటుంది. మన జాతక చక్రం తదనుగుణంగా తయారు అవుతుంది. మన కర్మే గ్రహాల రూపములో వచ్చి మనల్ని బాధ పెట్టడమో లేదా సుఖ పెట్టడమో జరుగుతుంది. అనవసరంగా గ్రహాలను తిట్టుకొంటాము మనము. ఆ గ్రహాలు కూడా ఎదో మనిషి రూపములోనో  లేదా రోగాల రూపం లోనో వచ్చి మనల్ని బాధ పెడుతుంటాయి.

మరి పాపం అంటే ఏమిటి? చెడు కర్మ, చెడు పని పాపం అన్నారు. మరి చెడు పని అంటే? శాస్త్ర వచనమునకు తద్భిన్న మైనది, విరుద్ధ మైనది. అంటే ఒక జీవి పట్ల అనుచితముగా ప్రవర్తించడం. ఉదాహరణకు:- ఒకర్ని తిట్టినాము, కొట్టినాము, అనరాని మాటలు అన్నాము, ఒక ప్రాణిని హింసించినాము. ఎదుటి వారిని బాధ పెట్టినాము, అన్యాయంగా ప్రవర్తించినాము, ఇతరులను మోసం చేయుట, దొంగతనము, ఇలా ఎన్నో చెప్పుకోవచ్చును.

శ్లో||  నా భుక్తం క్షీయతే కర్మ, కల్ప కోటి శతైరపి, అవశ్యమను భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభమ్ ||

అనగా అనుభవించనిచో కర్మ ఫలము కోటి బ్రహ్మ కల్పములు గడిచిననూ నశింపదు. అది శుభమైననూ, అశుభమైననూ దాని ఫలమును మనము తప్పక అనుభవింపవలసినదే అని అర్ధము.
అందుకని పరమాత్ముడి కైననూ తిప్పలు తప్పవు అని అనడంలో అర్ధం ఏమిటంటే ఎంతటి వాడికైనా జన్మ తీసుకొంటే కర్మ అనుభవించ వలసినదే అని అర్ధము. ఇక్కడ పరమాత్మ అంటే పరమాత్మ అని అర్ధము కాదు. కోటీశ్వరుడి కైనా క్షుద్భాధ తప్పదు అని అంటే. కోటీశ్వరుడు అని అర్ధము ఎంతటి వాడి కైనా ఆకలి బాధ తప్పదు అని అర్ధములో కోటీశ్వరుడు అని వాడుతాము. నా భార్య బంగారం అంటే MY WIFE IS GOLD  అని కాదు అర్ధము నా భార్య చాలా మంచిది అని అర్ధము. ఒక పదాన్ని ఏ సందర్భంలో వాడినామో తెలుసుకోకుండా, పరమాత్మకు జన్మ లేదు, ఆయనకు తిప్పలు లేవు, పరమార్ధం తెలుసుకోవాలి అని దురుసుగా పెద్దా చిన్నా లేకుండా మాటలాడ కూడదు. అదే పాపం అనేది.

 పెద్దలను, ఇతరులను నోటికి ఇష్టం వచ్చినట్లు అహంకారంతో మాటలు అంటే వాళ్ళు ఎంత నోచ్చుకొంటారో అనేది తెలియక పోతే, కనీసం ఆ తరువాత అయినా పశ్చాతాపం తో క్షమాపణలు చెప్పక పోతే ఎవరికి నష్టం. నోటి దురుసు తనమునకు జన్మ జన్మలు బాధ పడవలసి వస్తుంది. అసలు పరమాత్మ తత్త్వం ఎందులో కనిపించదు. సమస్త జీవ రాశిలో వున్నది ఆ పరతత్వం, పరమాత్మ తత్త్వం చూచే కన్నులు వుంటే. ఎందుకు అర్ధం చేసుకోలేక పోతున్నారో నాకు అర్ధం కాదు. విడిగా ఎక్కడన్నా కూర్చోని ఉంటాడా ఆ పరమాత్ముడు? ఆయనకు పేరు, రూపం, స్థితి, గుణం ఏవీ లేవు. అంతటా నిండి నిభిడీకృతమై వున్నాడు. ఎవర్ని అవును అంటావు? ఎవర్ని కాదు అంటావు? ప్రతి కణంలో వున్నాడు పరమాత్మ. ఆయన లేని చోటు లేదు. నీలో, నాలో అందరిలో వున్నాడు. మనం అజ్ఞానం లో వుండి చూడ లేకున్నాము, గుర్తించ లేకున్నాము. ఆ విశ్వకర్త అన్ని రూపాలలో వున్నాడు. ఆఖరాకి ప్రతి గాలి, ధూళి కణంలో కూడా వున్నాడు. ఆయన్ను గుర్తించ లేని అంధులము మనము. గిరి గీసుకొని బ్రతుకు తున్నాము.

తెలిసి చేసినా, తెలియక చేసినా పాపం పాపమే. ఒకరి పట్ల మనము ఏదన్నా తప్పు చేసిన యెడల వెంటనే వారిని మనము క్షమాపణలు అడగాలి, లేదంటే అది జన్మ జన్మలు మనల్ని వెంట తరుముతూనే వుంటుంది. నిన్నే కాదు, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను కూడా వదలి పెట్టదు. మనము చేసిన తప్పులు వలన మన పిల్లలు అనుభవించాలి. తాతలు, ముత్తాతలు చేసిన తప్పులు ఆ వంశంలో ప్రతి ఒక్కరినీ వెంటాడుతూ వుంటాయి. కొందరి జాతకములు పరిశీలించి నప్పడు ఇలాంటివి బయట పడుతూ వుంటాయి. ముఖ్యముగా సర్ప దోషములు, రాహు కేతు దోషములు. కొడుక్కు వుంటుంది, కూతురుకి వుంటుంది, భార్యకు, భర్తకు, తల్లికి, తండ్రికి, తాతకు అందరికీ అందరికీ ఒకే విధముగా వుంటుంది. ఎందువలన? ఎవరో, ఎప్పుడో ఎక్కడో చేసిన చిన్న తప్పు, తరతరాలు వెంటాడుతూ వస్తుంది. ఇలాంటివే కాల సర్ప దోషములు కూడా. అల్లాడి పోతూ వుంటారు. ఎందుకని పాపం. అహంకారముతో చేసిన ఒక పని పాపం గా మారినది.

చేసిన చిన్న తప్పు మహా పాపం గా మారకుండా ఉండాలంటే ఏమి చేయాలి? నీ కుటుంబాన్ని వేధించకుండా ఉండాలంటే ఏమి చేయాలి?

ప్రాయశ్చిత్తై రపైత్యేనః....... ప్రాయశ్చిత్తముతో పాపములు తొలగి పోవును.

పశ్చాతాపంతో కూడిన ప్రాయశ్చిత్తం. ప్రాయశ్చిత్తం చేసుకొంటే తప్పక పాపం పోవును అని శాస్త్రం చెప్పినది. పరాశర స్మృతి చెప్పినది.

శ్లో|| ప్రాయో నామ తపః ప్రోక్తం చిత్తం నిశ్చయ ఉచ్యతే, తపోనిశ్చయ సంయుక్తం ప్రాయశ్చిత్తం తదుచ్యతే.||

ప్రాయాస్ అనగా తపస్సు. చిత్తము అనగా నిశ్చయము. నిశ్చయముతో కూడిన తపస్సు చేయడమే ప్రాయశ్చిత్తం అని అన్నారు. అంటే నీకై నీవు దండన విధించుకోవడం. లేదా మీ గురువుల దగ్గరకు వెళ్లి, పెద్దల దగ్గరకు వెళ్లి “ అయ్యా, నేను ఫలానా తప్పు చేసినాను, నా తప్పు పోవాలంటే ఏమి చేయాలో శెలవు ఇవ్వండి” అని విధేయతతో అడగాలి. గురువులు చెప్పిన విధముగా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి.
ఆలస్యముగా లేచినావు, ఆలస్యముగా అర్ఘ్యం ఇచ్చావు. ప్రాయశ్చిత్తం చేసుకో. మూడు సార్లు ఇచ్చేది నాలుగు సార్లు చెయ్యి. అనుష్టానం లో లోపం జరిగినది, ఇంకో 108 గాయత్రి అధనముగా చెయ్యి.  అన్నదానం చేయాలి, ఆర్ధిక స్థోమత లేని వాడివి, ఇంకో పదివేలు మూల మంత్రం జపం చెయ్యి. ప్రతి దానికి, ప్రతి మంత్రానికి, ప్రతి కార్యానికి, ప్రతి తప్పుకు శాస్త్రములో ప్రాయశ్చిత్తం చెప్పబడి వున్నది. అది తెలుసుకో నీ గురువులను అడిగి. మీ ఇంటి పురోహితుడ్ని అడుగు చెబుతాడు. వెంటనే చెయ్యి.
ఎవరి పట్ల అయినా తప్పుగా ప్రవర్తించినావు, వెంటనే “అయ్యా, పొరబాటు అయినది, నన్ను క్షమించండి అని అడుగు.
క్షమించమని అడగ కుండా నేను ప్రాయశ్చిత్తం చేసుకొంటాను అంటే కుదరదు. పాపం పోదు. ఎవరి పట్ల మనము అగౌరవముగా ప్రవర్తించినామో, వారిని క్షమాపణలు అడిగి తీరాలి. అప్పుడే మనము చేసిన పాపం పోతుంది.

ఒక వేళ క్షమాపణలు అడగ లేని పరిస్థితి, ఆ వ్యక్తి కనిపించలేదు, లేదా ఏదన్నా ప్రాణిని తెలిసో, తెలియకో హింస పెట్టినావు, లేదా చూసుకోకుండా చంపినావు, అప్పుడు మాత్రమే మీ గురువులను అడిగి ప్రాయశ్చిత్తం తెలుసుకొని చేయాలి.
పశ్చాతాపంతో కూడిన ప్రాయశ్చిత్తం గాని, లేక క్షమాపణలు గాని ఎటువంటి పాపము నైననూ కడిగి వేస్తుంది.
సులభమైనది మనస్పూర్తిగా క్షమాపణలు అడగడం.
గురువులు, పెద్దలు లేనప్పుడు, వీలు కానప్పుడు నీకై నీవు ప్రాయశ్చిత్తం విధించుకోవచ్చును. నీ సుఖాన్ని నీవు త్యాగం చేసుకోవడమే ప్రాయశ్చిత్తం. ఒక రోజు భోజనం మానేయడం, పది రోజులు ఉపవాసం వుండడం, లేదా మౌన వ్రతాన్ని పాటించడం, నేలపై పరుండడం, ఇలా....

దోషములు పోగొట్టుకొనుటకు ప్రాయశ్చిత్తములున్నవి, అంతే గాని దోషములు చేయుటకు కాదు.

ప్రాయశ్చిత్తం చెప్పబడినది కదా అని పాపములు చేయకూడదు. దానికి నిష్కృతి లేదు. అలాగే పశ్చాతాపం లేకుండా ప్రాయశ్చిత్తం చేసుకున్నా అది కూడా వ్యర్ధమే. పాపము పోదు.

శ్లో|| ప్రాయశ్చిత్త మకుర్వాణాః పాపేషు నిరతా నరాః, అపశ్చాత్తాపినః కష్టాన్నరకాన్ యాంతి దారుణాన్ ||

పశ్చాతాపంను మించిన ప్రాయశ్చిత్తం లేదు అని పెద్దలు చెప్పుదురు. ఇది వీలుకాని పరిస్థితులలో మాత్రమే చేయ వలెను.   చేసిన తప్పుకు క్షమాపణలు అడగడమే ఉత్తమోత్తం. దానిని మించినది లేదు.

ప్రాయశ్చిత్తము వలన దోష నిర్మూలన తప్పక జరుగును, అయితే బుద్ధి పూర్వకముగా చేసిన యెడల పాపము పోదు అని చెప్ప బడినది.
శ్లో|| కామాకామకృతం తేషాం మహాపాపం ద్విధాస్మృతమ్ ||

బుద్ధి పూర్వకముగా చేసినది, కోరక చేసినది అని పాపములు రెండు విధములు. తెలియక చేసిన పాపములు, తెలిసి కావాలని చేసిన పాపములు. తెలియక జేసిన పాపములు ప్రాయశ్చిత్తము వలన నిర్మూలనము అగును. కానీ పొగరుతో, తెలిసి తెలిసి కావాలని చేసిన పాపములు  ప్రాయశ్చిత్తముతో పోవు  అని తెలియవలెను.

ఒకరు చేసిన పాపములు (పూర్వజన్మ) వారి జాతక రీత్యా తెలుసుకొనవచ్చును. ఒకరి పాపములను ఇంకొకరు తీసుకొని అనుభవించ వచ్చును. తమ పుణ్యమును ఇతరులకు ధార పోయ వచ్చును. మంత్ర శాస్త్రములో ఇది వీలు అగును. మహా గురువులు తమ శిష్యుల యొక్క భక్తుల యొక్క పాపములు తాము తీసుకొని అనుభ వించిన సందర్భములు ఎన్నో కలవు. మరొక మారు ఈ విషయము పై తెలుసు కొనెదము.

మీ
భాస్కరానంద నాధ/24-08-2014.



Monday 30 June 2014

ముద్రలు – రకములు

ముద్రలు – రకములు

శ్లో|| మోదనాత్ సర్వ దేవానాం ద్రావణాత్ పాపసంతతేః
      తస్మాన్ముద్రేతి విఖ్యాతః మునిభిస్తన్త్ర వేదిభిః ||  (మంత్ర మహోదధి)

ము అంటే మోదము, సంతోషము కలిగించునది, ద్రా అంటే పాపములను క్షయింప జేయునది.
ఒక్కో దేవతకు ఒక్కో పూజావిధానము, ధ్యాన శ్లోకము, మంత్రము, యంత్రము, తంత్రము వుంటుంది. తంత్రము అంటే పూజా విధానము. ఆయా దేవతల పూజా కల్పము ననుసరించి ధ్యాన ముద్రలు వుంటాయి. ఆయా దేవతలను ఉపాసించు సమయమున ఆయా దేవతలకు ఇష్టమైన ముద్రలను ప్రదర్శించాలి. ఆయా దేవతల హస్తముల యందు ధరించిన ఆయుధములను, వస్తువులను ప్రదర్శించుట ముద్ర అని అందురు. ఒక్కో దేవత ఒక్కో ముద్ర పట్టుకొని వుంటుంది. జప పూజాదుల సమయము నందు ఆయా ముద్రలను ప్రదర్శించి ఆయా దేవతల కరుణాకటాక్షములను, ప్రసన్నం చేసుకోవడానికి ముద్రలను ప్రదర్శిస్తూ వుంటారు. ముద్రలు దేవతలకు ప్రీతీ కలిగిస్తాయి.  గాయత్రీ జప సాధనయందు కూడా పూర్వ ముద్రాః, ఉత్తర ముద్రాః అని ముద్రలు ప్రదర్శించుట శిష్టాచారముగా గలదు.

శ్రీవిద్యోపాసకులు ముఖ్యముగా శ్రీచక్రార్చన యందు ఆవాహనాది ముద్రలు, మరియు దశ ముద్రలు ప్రదర్శించెదరు.
శ్రీచక్రము నందు త్రైలోక్య మోహన చక్రము నందు మూడు వృత్తములు గలవు. వీటిని భూపుర త్రయము అని అందురు.
మొదటి భూపురము నందు అణిమాది అష్ట సిద్దులు, రెండవ భూపురము నందు బ్రాహ్మి మొదలగు అష్ట మాతృకలు గలరు.  వీటిలో మూడవదైన తృతీయ భూపురము నందు దశ ముద్రా శక్తులు గలవు. ఆయా దేవతల పేర్లు,
సర్వ సంక్షోభిని, సర్వ విద్రావిణి, సర్వాకర్శిణి, సర్వ వశంకరి, సర్వోన్మాదిని, సర్వ మహాంకుశ, సర్వ ఖేచరి, సర్వ బీజ, సర్వ యోని, సర్వ త్రిఖండ. ఈ దశ దేవతలకు దశ ముద్రలు గలవు. ఈ దశ ముద్రలతో ఆయా దేవతలను ఆవాహన చేయుదురు. (భాస్కరరాయల వారి సేతు బంధనము)

ఆవాహనాది ముద్రలు.:- ౧. ఆవాహన, ౨, సంస్థాపన, ౩, సన్నిధాపన, ౪, సన్నిరోధన, ౫, సంముఖీకరణ,             ౬, అవగుంఠన, ౭, సకలీకరణ, ౮, అమృతీకారణ,  ౯, పరిమీకరణ,  ౧౦, నమస్కార ముద్ర. (ఇవి గురువుల వద్ద నేర్చుకోనవలెను)

నైవేద్య ముద్రలు
యజమాని కుడి చేతి వైపు నీళ్ళు చల్లి , మత్స్య ముద్ర తో, చంధనముతో, చతురస్రము, దానిలో వృత్తము లిఖించ వలెను. దాని పైన మహా నివేదన పాత్ర వుంచవలెను.  గాలినీ ముద్రతో విషమును వడ కట్టి, గరుడ ముద్రతో ఆ విషమును హరించి, ధేను ముద్రతో అమృతీకరణము గావించి, గాయత్రీ మంత్రముతో ప్రోక్షణ గావించి  పంచ ప్రాణములకుపంచ ఆహుతులు, పంచ ముద్రలతో సమర్పించ వలెను స్వాహా కారముతో. 

విష్ణు ముద్రలు:- శంఖ, చక్ర, గదా, పద్మ, వేణు, శ్రీవత్స, కౌస్తుభ, వనమాల, జ్ఞాన, బిల్వ, గరుడ, నారసింహి, వారాహి, హయగ్రీవి, ధనుః, బాణ, పరశు, జగన్మోహిని, కామ అను ఈ 19 ముద్రలు విష్ణు ప్రియమైనవి.

ఇలా ఒక్కో దేవతకు ఒక్కో ముద్ర గలదు.
కుంభ ముద్రతో అభిషేకము, పద్మ ముద్ర తో ఆసన శుద్ధి చేయవలెను.
తామర పువ్వు సమర్పించడానికి  త్రిఖండ ముద్ర వేసి చూపించెదరు.
ఇలా వివిధ మైన ముద్రలతో చివరన సర్వ ఖేచరీ ముద్ర, యోని ముద్రలతో పూజ, అర్చన పరి సమాప్తము అగును.
ఆయా దేవతల ముద్రలు గురువుల వద్ద నేర్చుకొన వలెను.

 మీ 
భాస్కరానంద నాథ /30-06-2014

Thursday 26 June 2014

మంత్ర శాస్త్రము - శక్తి

మంత్ర శాస్త్రము - శక్తి 
ఒక ఊర్లో ఒక శాస్త్రి గారు వుండేవారు ఆయన పరమ నిష్ఠా గరిష్టుడు. వాళ్ళ తాత ముత్తాతల నుంచి వస్తున్న శివ పంచాయతనం వుండేది. శాస్త్రి గారు రోజూ నమక చమకములతో అభిషేకము చేసి శ్రద్దగా పూజ చేస్తూ వుండేవారు.
ఒకరోజు వాళ్ళ ఇంటి ఆవిడ గారెలు చేసి, వాళ్ళ పాలేరు కు నాలుగు పెట్టినది. వాడు కమ్మగా తిని, అమ్మా ఇంక నాలుగు వడలు పెట్టు అమ్మా అన్నాడు. ఇంటి ఆవిడ “లేవురా అయిపోయినాయి” అన్నది.
అదేంటి అమ్మగారు ఇంట్లో ఇంకా 23 గారెలు పెట్టుకొని లేవు అంటారు అని అన్నాడు.
ఆవిడ వంటింట్లోకి వెళ్లి లెక్క పెడితే సరిగ్గా 23 గారెలు వున్నాయి. నీకెలా తెలుసురా అని అడిగినది. తెలుసులెండి అని వాడు అన్నాడు. ఈ విషయాన్ని తన భర్త కు తెలిపినది ఆ మహా ఇల్లాలు. శాస్త్రి గారు పాలేరును నిలదీసినాడు ..నీకు ఎలా తెలుసు అని. తెలుసు లెండి గురువు గారు అన్నాడు. వదల లేదు శాస్త్రి గారు. అదొక విద్య లెండి నాకు మా అయ్య నుంచి వచ్చినది, నాకు ఒక యక్షిణి చెవులో చెబుతుంది ఇదంతా అన్నాడు.
ఆ రోజు రాత్రికి శాస్త్రి గారికి నిద్ర పట్టలేదు. ప్రక్క రోజు పాలేరును అడిగాడు. ఒరేయ్ ఇన్ని రోజుల నుంచి నేను పూజ చేస్తున్నాను, నాకు ఏ విద్య రాలేదు, ఏ శక్తి రాలేదు, నీకు ఈ విద్య ఎలా వచ్చినది? ఆ మంత్రము ఏమిటో నాకు చెప్పరా అని అడిగినాడు.
విధి లేక పాలేరు ఆ మంత్రాన్ని (కర్ణ పిశాచి) మంత్రమును గురువు గారికి చెప్పినాడు. ప్రక్క రోజు గురువు గారు శ్రద్దగా ఆ మంత్రాన్ని పఠించినాడు. కర్ణ పిశాచి ఇంటి బయట నుంచి పలికినది. శాస్త్రి గారూ అని పిలిచినది. ఏమి కావాలి అని అడిగినది. గురువు గారు ఇంట్లో నుంచి ఎవరూ అని అడిగినాడు. నేను కర్ణ పిశాచిని (యక్షిణి) మీ ఇంట్లోకి రావాలంటే ఆ పూజా మందిరములోని దేవతా మూర్తులను బయట పడెయ్యండి, నేను లోపలి వస్తాను అని అన్నది.
శాస్త్రి గారి గుండె గుభేలు మన్నది. అప్పుడు అర్ధమైనది. ఒరేయ్ మా ఇంట్లో పూజా మందిరములోని దేవతా మూర్తులు ఎంత శక్తి వంతమైనవో, వాటి వలనే గదా ఈ పిశాచము లోనికి రాలేదు. ఇలా ఎన్ని రోజుల నుంచి నన్ను నా కుటుంబాన్ని దుష్ట శక్తుల నుంచి కాపాడు తున్నాయో గదా, ఇన్నాళ్ళు నాకు తెలియ లేదు, పెద్దలు ఇచ్చిన నిజమైన ఆస్తి ఇదే కదా అని, నీవూ వద్దు, నీ మంత్రము వద్దు అని ఆ పిశాచాన్ని వెళ్లి పొమ్మన్నాడు. తన పూజా మందిరములోకి వెళ్లి ఆ పరమ శివుని కాళ్ళ మీద పడి కృతజ్ఞతతో “ ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే రుద్రాయ నమః” అని చెంపలు వేసుకొన్నాడు. మంత్ర విద్య వున్నది నమ్మకము శ్రద్ధ అవసరము దేనికైనా.
పూజా మందిరములో వున్న విగ్రహాలు పాతవైనా, అరిగి పోయినా మీ తాత ముత్తాతలు పూజించినవి అవి. వాటిల్లో ఎంతో శక్తి దాగి వుంటుంది. వాటిల్ని పారేయకండి. భక్తితో ఒక్క పుష్పం పెట్టండి. అవి చైతన్య మౌతాయి. మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాపాడుతాయి.

ఆ శాస్త్రి గారు మా ముత్తాత.....ఈ కధ మా బామ్మ గారు మాకు చిన్నప్పుడు చెబుతూవుండేది....
భాస్కరానంద నాథ /26-06-2014@ శ్రీకాళహస్తి