Sunday, 14 September 2014

గరుడ పురాణం – భగవంతుడి శిక్షాస్మృతి
మానవునికి శాశ్వతమైన శ్రేయస్సును, దానికి మార్గమును తెల్పు గ్రంథములు వేదములు. అవి అపౌరుషేయములు, వాటి అర్ధములను అందు ప్రతిపాదింపబడిన ధర్మములను సులభముగా తెలుసుకోనుటకై ఇతిహాస పురాణములు వెలువడినవి. ఆ పురాణములను ప్రతి ఒక్కరూ తప్పక చదివి ధర్మాధర్మములను, పాప పుణ్యములను  తెలుసు కొనవలయును. శాస్త్రము ననుసరించి మానవుడు నడుచుకోనవలెను. ఆ శాస్త్రమును గురించి చెప్పు వాడ్ని శాస్త్రి అని అందురు.
అష్టాదశ పురాణములలో ఒకటి గరుడ పురాణము.  ఈ గరుడ పురాణము శ్రీ మహావిష్ణువు చేత గరుత్మంతునికి ఉపదేశింపబడినది. విష్ణు ఆరాధన, తులసీ మహాత్మ్యము, ఏకాదశి వ్రత విధి, నామ మహిమ, సదాచార విధానము మొదలగు పెక్కు విషయములు ఇందు చెప్ప బడినవి.
గరుడ పురాణం అనేది మనిషిని సన్మార్గంలో నడిపించడానికి మన పెద్దలు వ్రాసిన ఒక మహత్తరమైన గ్రంథం. దీనిని చదవడంవల్ల మనిషి తన జీవితాన్ని మంచి మార్గంలోకి మలచు కోవడానికి ప్రయత్నిస్తాడు.
అష్టాదశ పురాణాల్లో గరుడ పురాణానికి ఎంతో ప్రత్యేకత వుంది ... మరెంతో ప్రాధాన్యత వుంది. అయితే మిగతా పురాణాలు చదివినంత తేలికగా ... ఆసక్తిగా గరుడపురాణం చదవడానికి చాలామంది ఇష్టపడరు. అందుకు కారణం గరుడపురాణం పట్ల వారికి గల అపోహేనని చెప్పవచ్చు. ఏదో చెప్పనలవి కాని భయము, అపోహ. మరణించినప్పుడు మాత్రమే చదువ వలెను అని, ఇతర రోజులలో చదువకూడదు అని అపోహ, అశుభం అని కొందరి భయము. ఇది తప్పు. ప్రతి ఒక్కరూ చదువ వచ్చును. తల్లిదండ్రులు వున్నవారు మాత్రము ఇందులోని అంత్యేష్టి విధానము చదువ కూడదు. మిగతా అన్ని విషయములు చదువ వచ్చును, తప్పక చదివి తెలుసుకోవలయును. ఈ పురాణము అందరి ఇండ్లల్లో ఉండవచ్చును. గరుడ పురాణమును అందరూ నిరభ్యంతరముగా చదువ వచ్చును అని శ్రీ మల్లాది చంద్ర శేఖర శాస్త్రి గారు చెప్పి యున్నారు. ఈ పురాణమును బ్రాహ్మణులకు దానము చేయుట చాలా విశేషము.
ఈ పురాణంలోని విషయాలు గరుత్మంతుడి సందేహాలను తీర్చడానికి శ్రీమహావిష్ణువు చెప్పే సమాధానాలుగా కనిపిస్తాయి. దేహాన్ని వదిలిన అనంతరం ఆత్మ ప్రయాణం ... జీవికి ఎదురయ్యే పరిస్థితులు ఈ పురాణంలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఈ కారణంగా కొన్ని ప్రాంతాల్లో ... కొన్ని కుటుంబాల్లో శ్రార్ధ సమయాల్లో గరుడ పురాణం చదవడం ఆనవాయతీగా వస్తోంది.  జీవుడి ప్రయాణం, జీవుడి కర్మ, పాప పుణ్యములు, యాతనా శరీరం, యమపురి, చావు పుట్టుకలు, అంత్యేష్టి విధానము, పునర్జన్మ, రోగములు, వ్యాధులు, దానములు ఇవన్నీ తేటతెల్లముగా చెప్పబడినవి. జీవుడు ఉత్తమ జన్మలు పొందాలంటే ఏమి చేయాలి, కర్మ, జన్మ, పాపము, పుణ్యము, రోగాలు, ప్రమాదాలు ఇలా ఎన్నో ఆశక్తి కరమైన విషయములు తెలుసుకో వచ్చును. తల్లి దండ్రులు వున్న వారు ప్రేత కల్పం తప్పించి మిగతా అన్ని విషయములు, అన్ని అధ్యాయములు  అందరూ చదువ వచ్చును.
 మీ
భాస్కరానంద నాథ /14-09-2014/SRI KALAHASTHI.  

No comments:

Post a Comment