Sunday, 29 March 2015

రామాయణం

రామాయణం
శ్రీరామ చరిత్రం పరమ పవిత్రం , పాపాలను నశింపజేస్తుంది, పుణ్యం సమకూర్చి పెడుతుంది. ఇది వేదంతో సమానము. రామాయణ  గానం ఆయుర్ధాన్ని పెంపోదిస్తుంది. రామాయణం పఠించే వారు పుత్ర పౌత్రాదులతో. దాస దాసీ జనులతో స్వర్గ సుఖం అనుభవిస్తారు. మరణానంతరం దేవతలచే పూజింపబడుతారు.
రామాయణాన్ని బ్రాహ్మణులు పఠిస్తే అష్టాదశ విద్యలందు ప్రావీణ్యులవుతారు. క్షత్రియులు పఠిస్తే భూమండలాధిపతులౌతారు. వైశ్యులు పఠిస్తే అధిక సంపదలు పొందుతారు. శూద్రుడు పఠిస్తే గొప్ప వాడవుతాడు.
అటువంటి రామ రాజ్యంలో దుర్భిక్షం లేదు, వ్యాధులు లేవు, భయం లేదు, తండ్రి బ్రతికి వుండగా పుత్రులు మరణించే వారు కారు. స్త్రీలకు వైధవ్యము వుండేది కాదు. అగ్ని భయం లేదు, ఈతి భాధలు లేవు. ముసలితనం చే గాని, వ్యాధులచే గాని బాధలు ఉండేవి కావు. జనులు అందరూ సుఖ సంతోషములతో  జీవించే వారు.  దేశమంతా సుభిక్షమై ధన ధాన్యములతో సమవృద్ధిగా వుండేది.
ఇది కావ్యం, సీతమ్మ చరితం, సీతమ్మ నడయాడిన మహా కావ్యం. ఎందుకంటే రామా అంటే సీతమ్మ, ఆయనం అంటే నడచిన, నడయాడిన. ఇది జగన్మాత నడయాడిన చరిత్ర.
కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్ ....అని అన్నారు మహర్షి.  రామ కధను వాల్మీకి మహర్షి శ్లోక బద్ధం చేసి ఒక మహా కావ్యం గా మలచినారు. పుణ్యప్రదమైనది, మనోహర మైనది ఇది.  
నమః పరాయ దేవాయ పరాత్పరతరాయ చ ,
పరాత్పర నివాసాయ స గుణాయాగుణాయచ ,
 జ్ఞానా జ్ఞాన స్వరూపాయ ధర్మాధర్మ స్వరూపిణే,
విద్యాzవిద్యా స్వరూపాయ స్వ స్వరూపాయ తే నమః ||
విశ్వామిత్రుడు
మహారాజా, శూరుడు, సత్య పరాక్రమ వంతుడూ అయిన నీ కుమారున్ని రామున్ని నాతో పంపు, దుర్మార్గులైన ఆ రాక్షసులను వధించే సామర్ద్యం రామునికి మాత్రమే వుంది. రాముని శౌర్య పరాక్రమాల గూర్చి నీవు సందేహపడ వద్దు. నేను, వసిష్టుడు మరి ఇతర మహర్షులు మాత్రమే రాముని నిజ స్వరూపాన్ని ఎరుగుదుము. రాముని సామాన్య మానవునిగా తలచ వద్దు, నా పలుకులు విశ్వసించు అని విశ్వామిత్రుడు అంటాడు దశరధని తో.  నా యాగం ఆగిపోకుండా చూడు అని అంటాడు. ఇక్కడే ఒక విషయం మనం అర్ధం చేసుకోవాలి. విశ్వామిత్రుడు ఒక ఋషి, ఒక తపస్వి. తాను చంప లేడా ఆ రాక్షసులను. ఒక శాపం ఇవ్వలేడా? ఇవ్వగలడు. చంపగలడు. అదే విషయాన్నీ దశరథునితో అంటాడు. “రాజా నేను వారిపై ఆగ్రహం చూపకూడదు. నేను తలపెట్టిన యాగం అటువంటిది. కాబట్టి శాపమియ్యరాదు.  శాపం అంటే ఏమిటి? శత్రువును నశింపజేసేది లేక అణగకొట్టే కర్మము. అదొక ప్రయోగము . ఆ ప్రయోగము ఆరు విధాలు. అందులో ఇది హరణ ప్రయోగము. ఉపాసకుడు దేవతను ఉపాసించి, తృప్తి పరచి ఆ దేవత ద్వారా ఆ శత్రువును నాశనం చేస్తాడు. దీన్నే హరణ ప్రయోగం అంటారు. ఈ ఒక్క హరణ ప్రయోగం వల్ల జీవితాంతం చేసిన తపః ఫలం నశించిపోతుంది. మళ్ళీ ఆ తపః ఫలం సమకూర్చు కోవాలంటే ఎన్నో సంవత్సరాలు తపస్సు చేయాలి. అంతే కాకుండా ఈ హరణ ప్రయోగం రెండో సారి ప్రయోగించ కూడదు. ఆ దేవతయే అతన్ని ద్వేషిస్తుంది. శాంతి ప్రయోగం తప్ప ఉచ్చాటన స్తంభానాకర్షణ, విద్వేషణ, మారణములన్నీ మళ్ళీ మళ్ళీ ఇంకొకరిపై ప్రయోగిస్తే అతడికి హాని కలుగుతుంది. అందువల్లనే ఉపాసకులు ఇతరులు బాధించినప్పుడు సహించి ఒర్చుకొంటారు. తపస్సు కూడా ఒక ఉపాసనమే. అయితే కొద్దిపాటి వ్యత్యాసం వుంది. ఉపాసకుడు ఉపాసన చెయ్యగా చెయ్యగా అంతఃకరణం పవిత్రమై, శుద్దియై సర్వమూ ఆ దేవతగానే దర్శిస్తాడు. స్వార్ధం లేని వాడికి మాత్రమే మంత్రం ఇవ్వబడు తుంది, సిద్ధింప బడుతుంది. మంత్రోపాసనకు స్వార్ధం లేని వాడే ముందుకు వెళ్ళగలడు, పై మెట్లు ఎక్క గలడు. లేదంటే ఆ మంత్రము తన దగ్గర ఎంత మాత్రము నిలవదు. ఆ దేవత ఒక్క క్షణము నిలబడదు. మంత్ర దేవత ఉపాసన చేత ఉపాసకునికి కట్టుబడుతుంది. తన చుట్టూ తిరుగుతుంది. నీ భక్తి ప్రేమలను బట్టి నీతో వుంటుంది నీ చివరిదాకా. లేదంటే ఆమెకు ఇష్టం లేదంటే ఒక్క క్షణం ఉండదు నీ దగ్గర. మంత్రము అనేది ఒక శక్తి. శబ్ద శక్తి.....page....2
BHASKARANANDA NATHA….22/03/2015
----------------------------------------------------------------------------------------------------------------------------------
గురువు గొప్పా శిష్యుడు గొప్పా ? గురువే గొప్ప. రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి గొప్ప వారు, జ్ఞానులు. జ్ఞానులు ఎలా అయినారు? ఎన్నో జన్మలలో ఎంతో సాధన చేసి, ఇలా ఈ జన్మ తీసుకొని పునర్జన్మ లేని స్థితికి మోక్షానికి వెళ్ళినారు. వాళ్ళు గొప్ప వాళ్ళు కాబట్టి అలా చేసినారు అని అనుకొంటే పొరబాటే. వాళ్ళు సాధన చేత గొప్ప వాళ్ళు అయినారు. నీవు కూడా సాధన చేత ఒక రమణ మహర్షి కావచ్చు, ఒక అన్నమయ్య కావచ్చు, ఒక రామదాసు కావచ్చు. సాధన , ఉపాసన వుండాలి. మార్గము చూపడానికి పాప కర్మలు తొలిగించడానికి మంచి గురువు వుండాలి. గురువు లేని విద్య రాణించదు. భగవంతుడి కైనా సరే గురువు వుండాలి. తప్పదు.
వశిష్టుడు దశరథుని తో ఇలా అంటున్నాడు.....” ఏష విగ్రహవాన్ ధర్మ ఏష వీర్యవతాం పరః.... ఓ రాజా, ధర్మమే ఈ విశ్వామిత్రుడి రూపంలో కనిపిస్తున్నాడు. ఇతడు మహా వీరులలో శ్రేష్టుడు, బుద్దిమంతుడు, తపోనిధి, బ్రహ్మర్షి. కాబట్టి సందేహించకుండా రామున్ని ఇతని వెంట పంపు. ఇతడు నీ కుమారుడి చేత ఏయే కార్యాలు ధర్మమార్గం అనుసరించి చేయాలో, ఏయే కార్యాలు బుద్ధి బలం చేత చేయించాలో , ఏయే పనులు తపోబలం చేత సాధించాలో వాటిని అన్నింటినీ ఆయా పద్దతులద్వారా చేయించగల నేర్పరి. రాముడు అస్త్ర విద్యలు నేర్చినా, నేర్వక పోయినా విశ్వామిత్రుని రక్షణలో వున్నతవరకు అగ్నిచే రక్షింప బడిన అమృతం వలె రాక్షసులు ఇతన్ని ఏమే చేయలేరు అని వసిష్టుడు అన్నాడు. పరతత్వము తెలిసిన ఈ ముని రామున్ని రక్షిస్తూ వుంటాడు. అగ్ని జ్వాలలు అమృతాన్ని రక్షించినట్లు అంటే ఈ రాముడు అమృత స్వరూపుడు, ప్రకృతి ఆ తత్వాన్ని ఆవరించి వుంది. అంటే అమృతం అనబడే పర తత్వాన్ని ప్రకృతి ఆవరించి వున్నది, అనగా రాముడు మాయా మానుష విగ్రహుడని అర్ధం. ఈ విషయాన్ని భగతత్వాన్ని ఎరిగిన విశ్వామిత్రుడు కాపాడుతాడని   సారం.  నారాయణ మంత్రము ను ఉపాసించిన మహర్షులు ముక్తిని పొందుతారు, అదే మంత్రాన్ని రాజులూ ఉపాసించితే శత్రు సంహారం చేస్తారు. శ్రీరాముడు భగవంతుడే అయినా మానవరూపంలో వుండడటం వలన గురువు వల్ల మంత్రోప దేశం పొంది సకల శాస్త్రములను నేర్చుకొన్న వాడు అయినాడు. భగవంతుడైన మానవ రూపంలో అవతరించినప్పుడు గురువును ఆశ్రయించాలి. లోకం కూడా అతడి మార్గంలోనే అనుసరించాలి గదా. గురూపదేశం లేకుండా శిష్యుడు మంత్రాలూ నేర్చుకోకూడదు. ఒక వేళ దొంగతనంగా గ్రహించినా అవి ఫలించవు, ఫలించినా దుష్పలితాల్నే ఇస్తుంది. అందువల్లనే గురువును పూజించి , మెప్పించి ఆయన అనుగ్రహానికి పాత్రుడు కావాలి.
శివే రుష్టే గురుస్త్రాతా గురౌ రుష్టే ణ కశ్చన......మంత్ర సిద్దికి గురు భక్తియే మూలం, మంత్ర జపం కాదని గుర్తుంచుకోవాలి . అందువల్లనే ఈ ముని సకలాస్త్రవేత్త అని, ముల్లోకాలలో వుండే అస్త్రాలన్నీ ఎరిగిన వాడని వశిష్టుడు ప్రశంసించిచాడు. రాముడు భగవ౦తుడు అన్న విషయాన్నీ లోకులందరికీ ఈ ఉపదేశంలో తేట తెల్లమవుతుంది. రాముడే గురువు సేవచేసినప్పుడు ఇక మనమెంత అని లోకులుకు చెబుతున్నాడు.
అపూర్వాణాం చ జన నే శక్తో భూయస్స ధర్మ విత్ .....విశ్వామిత్రుడు ధర్మవేత్త, అంతే కాకుండా అనేక దివ్యాస్త్రాల్ని పుట్టించ గల సమర్ధుడు అంటే ఏమిటి అర్ధం? మహామంత్రాలు ఏడూ కోట్లని ప్రసిద్ది, ఎవరు ఎక్కువ కాలం ఏ అస్త్ర దేవతను ఉపాసిస్తాడో , అతడు ఆ దేవత అనుగ్రహానికి పాత్రుడవుతాడు. అట్లా అనుగ్రహ పాత్రుడైన వాడిని ఋషి అంటారు. ఏ విధముగా మంత్రాన్ని ఉపాసిస్తే ఆ దేవత ప్రత్యక్షమవుతుందో , అదే దాని విధి. ఆ విధముగా పూర్వం అనేక మంత్రాలూ ఉపాసించి వాటి ప్రసాదానికి పాత్రుడై , ఆ మంత్రానికి తాను ఋషి అయ్యాడు. అందువల్ల ఇతడి మూలంగా శ్రీరాముడికి అస్త్రాలన్నీ లభిస్తాయి...అని వసిష్టముని దశరధునికు నచ్చ జెప్పి కొడుకు విషయంలో వుండే భయాన్ని వదలి వేయమని ఉపదేశించాడు. ఈ విశ్వామిత్రుడు తాను తలుచుకొంటే ఆ రాక్షసుల్ని కాల్చి బూడిద చేయగలడు, అంతటి వాడు తపస్సును మధ్యలో వదిలేసి రాముణ్ణి తనతో పంపమని నిన్ను యాచిస్తున్నాడంటే , అది నీ పుత్రునికి మేలు చేయటానికే వచ్చాడని తెలుసుకో,
గురూపదేశం లేనిదే ఎట్టి మంత్రం ఫలించదు, గురువు సర్వ విషయములు తెలిసిన వాడై వుండాలని , శిష్యుడు వినయంతో , భక్తితో గురు సేవలు చేస్తే గాని ఫలం లభించదు అని భోధిస్తుంది, గురువు అనుగ్రహానికి పాత్రుడైన శిష్యుడు ముల్లోకాల్లోనూ ఖ్యాతిని పొందుతాడు. ...page..2.(ఇంకావుంది)
శ్రిభాస్కరానందనాథ /23-03-2015
వశిష్ట మహర్షి ఉపదేశం పొందిన తరువాత దశరధుని లోని భ్రమలన్నీ తొలగిపోయినాయి. తానే వెళ్లి స్వయంగా రామలక్ష్మణులను  తీసుకొని వచ్చి విశ్వామిత్రుని ఎదుట నిలబెట్టినాడు. దశరధుడు ప్రేమాతిశయంతో రాముని శిరస్సు ముద్దాడాడు.
ఇక్కడ మనం గమనించ వలసిన విషయం ఒకటి వున్నది. దశరధునికి భ్రమలన్నీ తొలగిపోయినాయి. దశరధుడు అంటే ఈ జీవి, పది ఇంద్రియములతో ఉన్న జీవుడు, ఈ శరీరము ధరించిన జీవాత్మ. వీడు ఒకరాగాన లొంగడు. జీవుడుకి జ్ఞానము లబించాలంటే గురువులు రావాలి. అందుకని విశ్వామిత్రుడు గురు రూపంలో వచ్చినాడు. జ్ఞాన భోధ చేసినాడు. మాయను తొలగించి పరమాత్మ దర్శనం గావించినాడు.
సంభూతిం చ వినాశం చ యస్తద్వేదో భయగ్౦ సహ, వినాశేన మృత్యుం తీర్త్వాసంభూత్యాzమృతమశ్నుతే ||
ఓ రాజా! రాముడు నీ కొడుకని అనుకొంటున్నావు, కానీ ఈ రాముడు అమృతుడు, అనగా ఉపనిషత్తు చే ప్రతిపాదించబడిన పరమాత్మ. అమృతానికి ఎక్కడైనా మృత్యు భయం వుంటుందా? అగ్ని జ్వాలలు అమృతాన్ని రక్షించినట్లు, ఈ రాముడే అమృత స్వరూపుడు. ప్రకృతి ఆ తత్వాన్ని ఆవరించి వున్నది....అని జీవుడు అనే దశరధునికి గురువు అనే విశ్వామిత్రుడు పరతత్వాన్ని గురించి ఉపదేశం చేసినాడు. మాయలో వున్న దశరధునికి జ్ఞాన భోధ చేసినాడు గురువు విశ్వామిత్రుడు. అప్పడు దశరధుడు (జీవుడు) రామలక్ష్మణులను పిలిచి ముద్దాడి పంపినాడు. అంటే రాముడు అంటే బుద్ధి, లక్ష్మణుడు అంటే మనస్సు. బుద్ధి, మనసు ఎప్పుడూ ఒకటిగా తోడుగా వుంటాయి, విడిచి వుండవు.  జీవుడు తనలోని బుద్దిని మనస్సును అప్పచేప్పినాడు. ముద్దాడి అంటే మనసును ఎప్పుడూ ముద్దాడాలి, కఠినంగా చెప్పకూడదు.
వినవె ఓ మనసా , వివరముగా తెల్పెదనే ...వినవె ఓ మనసా .....అని శ్రీ త్యాగరాజు అన్నారు.
మంచి శిష్యుడు కనిపించగానే మంత్రోపదేశం చేసి గురు పరంపరను వృద్ధి అయ్యేందుకు గురువు కృషి చేయాలి. అందువల్లనే ఆలస్యం చేయకుండా వచ్చి మంత్ర దీక్ష తీసుకోమని ఆదేశించినారు విశ్వామిత్రులు.
గృహాణ వత్స సఖిలం మా భూత్కాలస్య పర్యయః, మంత్రగ్రామం గృహాణ త్వం జరామతిబలాం తథా ||
మంత్రాన్ని చక్కగా ఉపాసించే శిష్యునికి ఉపదేశించి గురు పరంపర తెగిపోకుండా కాపాడాలి. అలా కాకుండా గురుపరంపరను తెగ కొట్టినట్లిైతే  పిశాత్వం వస్తుందని శాస్త్రం చెబుతుంది. పరోపకారానికి ఉపయోగించనిదే అది ఫలవంతం కాదు.
ఇక్కడ గురువు విశ్వామిత్రుడు రాజ్యాన్ని తృణప్రాయంగా వదిలేసి భగవత్సేవ చేసుకోవడానికి సిద్దపడినాడు. అంతే కాదు తపః ఫలాన్ని  అంతా లోకోపకారానికే వినియోగించాడు. ఇక శిష్యుడంటారా శ్రీరాముడు, పితృ వాక్య పరిపాలనకోసం రాజ్య భోగాలన్నింటిని వదలిన  త్యాగమూర్తి, ధర్మ మూర్తి.  అటువంటి శిష్యుడు దొరికినప్పుడు క్షణం కూడా ఆలస్యం చేయకుండా మంత్రోపదేశం చేయాలి. అదే చేసినాడు విశ్వామిత్రుడు.
శ్రి భాస్కరానందనాథ /24-03-2015
ఎవడి ఖర్మ వాడు అనుభవించక తప్పదు. తను చేసుకొన్న పాప ఖర్మే తన మృత్యువుగా వెంట బడి తరుముతుంది. ఎవడి తల వ్రాతను వాడే వ్రాసుకొంటాడు. హత్యలు చేసే వాడు మరొకడి చేతిలో హతుడు కాక తప్పదు అని మనకు రామాయణం చెబుతుంది.  కారణం లేకుండా మరో కారణం ఉత్పత్తి కాదు. రాక్షస సంహారం కోసమే రామావతారం వచ్చినది. వచ్చిన వాడు చంపక మానడు. రాక్షసులు హతులు కాక మానరు.  “రాజా నీ కుమారుని ముందు ఆ రాక్షసులు నిలబడలేరు. వాళ్ళను రాముడు తప్ప అన్యులు చంపలేరు. మానవ రూపంలో వచ్చినది మారీచ సుబాహులను చంపడానికే”....అని విశ్వామిత్రుడు దశరదునితో అంటున్నాడు. ఎవడు ఏ రకమైన క్రూర కర్మలు చేస్తారో వారి  ఆత్మ వినాశనాన్ని వారే కొని తెచ్చుకొంటారు. అనగా వారు కాల పాశానికి బద్దులు. దైవం నిమిత్తమాత్రుడు. వాళ్ళు చేసుకొన్న పాప కర్మ ఫలం చేతనే వారు మరణించబోతున్నారు. ఆ పని కాస్తా నీ కుమారుడి చేతుల మీదుగా జరగబోతున్నది. కాబట్టి సత్కర్మలు ఆచరించాలని చెబుతుంది రామాయణం.
రాముడు పరంధాముడు అని గ్రహించమని  విశ్వామిత్రుడు  ఎన్ని విధములుగా చెబుతున్నా దశరధుడు గ్రహించ లేకుండా వున్నాడు. ఎందువలన ? మహా మాయ.  వశిష్టుని వంటి తపోనిధులు తప్ప ఇతరులు తెలుసుకోలేరు. మహామాయ అనే మూల ప్రకృతిని ఉపాసిస్తే గాని భగవత్సేవకు పాత్రులు కాలేరు. అనగా ఏ రూపానికి పూజలు చేసినా ఆ రూపాలన్నీ ఆ ప్రకృతి శక్తివే కాబట్టి ఆమెకు చెందుతాయి. నిర్గుణ పరతత్వాన్ని బాహ్య పూజలు ద్వారా పూజించడం సాధ్యం కాదు. అందుకే ఉపాసన, ధ్యానం అని అన్నారు. ఈ సృష్టిలో పుట్టిన ప్రతి ప్రాణీ ఆ శక్తిలో నుంచి వచ్చినదే. ఆ తల్లి బిడ్డయే. అది దేవుడైనా, మానవుడైనా, ఋషి అయినా జ్ఞాని అయినా ఒక్కటే. ఆ మూల ప్రకృతిలో నుంచి వచ్చినదే, ఆమె గర్భంలో నుంచి వచ్చినదే. ఆ మహామాయకు, విష్ణు మాయకు లోబడి పని చేయాల్సినదే. ఇదే విషయాన్ని పదే పదే చెబుతూ, దశరధుని లో గూడుకట్టుకొన్న భావాన్ని తొలగించడానికి విశ్వామిత్రుడు శత విధములా ప్రయత్నం చేసుతున్నాడు.
అహం వేద్మి మహాత్మానం రామం సత్య పరాక్రమం ....అని. ఎంతో కాలంగా మహాత్ములను, పెద్దలను సేవించి అహం నేను తెలుసుకొన్నాను. ఏమిటి రాముడు సత్య పరాక్రముడు అని. ఇది సత్యం నమ్ము అని. సద్గురువులను సేవించడం వలన నేను తెలుసుకొన్నాను అని అన్నాడు విశ్వామిత్రుడు. అంటే మనం కూడా ఈ సత్యమును తెలుసుకోవాలంటే సత్ పురుషులను సేవించాలి, అప్పుడే ఈ జ్ఞానం వస్తుంది అని. గురువులను సేవించకుండా సత్య జ్ఞానము తెలియదు అని. రాముడు మానవ మాత్రుడు కాదు అని తెలియాలి అంటే లౌకిక దృష్టి పోవాలి, జ్ఞాన దృష్టి రావాలి అది రావాలి అంటే జ్ఞానులను సేవించాలి అని మహర్షి విశ్వామిత్రుని ద్వారా తెలుస్తున్నది.
శ్రి భాస్కరానందనాథ /26-03-2015



No comments:

Post a Comment