Friday 29 June 2012

శ్రీదేవీ - మహాత్త్వము


చండీ తత్వము
ఆది తత్త్వమును స్త్రీ మూర్తిగా భావించి చేయు ఉపాసన శ్రీవిద్యోపాసన అని అందురు  . ఇది లలితా పర్యాయము, చండీ పర్యాయము అని రెండు విధములు.
రెండింటికీ శబ్దతః భేదమే కానీ వస్తుతః భేదము లేదు. మొదటిది పంచదశాక్షర మూల మంత్రము తో కూడినది   . రెండవది నవాక్ష ర మంత్రముతో కూడినది.  ఆ పరమాత్మ స్వరూపాన్ని స్త్రీ మూర్తిగా పూజించుటలో ఒక విశేష సౌలభ్యము కలదు. లోకములో తండ్రి దగ్గర కంటే తల్లి దగ్గర పిల్లలకు చనువు ఎక్కువ. తల్లి పిల్లల తప్పులు ఎంచక వాళ్ళను కడుపులో పెట్టుకొని లాలిస్తుంది. అన్ని విధముల వాళ్ళను బుజ్జగించుచూ మంచి అభివృద్దిలోకి తెస్తుంది. తండ్రి కోపపడినా తల్లి అంత తొందరగా కోపపడదు. ఎంతో ప్రేమానురాగాలతో బిడ్డను దగ్గరకు తీసుకొని పాలిస్తుంది. బిడ్డ యొక్క మంచి చెడులను తండ్రి కన్నా తల్లికే ఎక్కువగా తెలియును. అందువలనే వేదము కూడా “మాతృ దేవోభవ” అనుచూ తల్లిని పూజించమని తండ్రి కంటే తల్లికే అగ్ర పీట వేసినది. తల్లి యందలి ఈ నిర్వ్యాజ ప్రేమానురాగాల వలన పూజలలో గూడా భగవంతుడిని అమ్మ వారుగా పూజించుటలోని విశేషము.
కాళిదాసు తన రఘువంశము లో “వాగార్దా వివ” అని స్మరించినాడు. ఆది శంకరులు “మాతా చ పార్వతీ” అని స్తుతించినారు. వశిన్యాది వాగ్దేవతలు “ శ్రీ మాతా” అని అమ్మను పిలిచినారు.

“దుర్మార్గుడైన బిడ్డ వుంటాడు గాని, దుర్మార్గురాలైన తల్లి వుండదు”... అని ఆది శంకరుల వారు అన్నారు.
జగన్మాత పూజ ఇతర దేవతల కంటే త్వరితముగా ఫలితము నిచ్చి, బిడ్డను రక్షించును. జగన్మాత ఉపాసనము మాతృ సేవ వంటిది. తల్లి బిడ్డలను పెంచి పోషించినట్లు, ఆ జగన్మాత తన్ను ఉపాసించు భక్తులను తన బిడ్డలుగా ప్రేమించి భుక్తి ముక్తులను తప్పక ఇవ్వగలదు.  ఆమెను సేవించడము అత్యంత సులభము. తప్పులున్ననూ తల్లి సవరించును.
శ్రీ చక్ర సంచారిణి యైన జగన్మాత జగత్తునంతయు పోషించుచూ చరాచర సృష్టికి మూల కారణమై అంతటా వ్యాపించి సర్వ ప్రాణులలో శక్తి స్వరూపం లో చిచ్ఛక్తి అయి, చైతన్యమై, పర బ్రహ్మ స్వరూపమై ప్రకాశిస్తూ వున్నది.
సకల ప్రాణులకూ ఆమె తల్లి అయి “శ్రీమాత” గా పిలువబడు చున్నది.  అందుకే ఆమెను “ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ” అని పోతనామాత్యుడు అన్నారు.
వేదములు “విద్య” అని ఏ దేవిని చెప్పుతూ వుంటాయో, ఆ దేవిని ఆశ్రయించిన వారి ఆర్తిని పోగొట్టే దయామయి ఆ దేవి. తన్ను నమ్మిన వారిని ఆదుకునే అమ్మ. మునులు ఆ తల్లి పాదములను ధ్యానించి జ్ఞానులవుతారు.
పరమేశ్వరుని యందే అంతర్లీనమై, రక్త వర్ణ ప్రభలచే వెలుగొందుచూ, జీవన్ముక్తికి, ఐహిక ఫల సాధనకు ప్రత్యక్ష సాక్షియై, శ్రీచక్రము నందలి బిందు స్థానమై నెల కొని యున్న ఆ తల్లి శ్రీ లలిత యై, మహా త్రిపుర సుందరిగా, పిలువబడుచున్నది.
౧. జప చండీ  ౨. హోమ చండీ  ౩. తర్పణ చండీ అని త్రి విధములుగా చండీ ఉపాసన కలదు.
గుణ త్రయములకు ప్రతీక అయిన మహాకాళీ, మహాలక్ష్మీ, మహాసరస్వతీ రూప కలయక  చండీ.
జగన్మాత సాత్విక రూపం లలిత అయితే, తామస రూపం చండీ.
 
చండీ పరాభట్టారికా అంటే మహాకాళీ, మహాలక్ష్మీ, మహాసరస్వతీ స్వరూపిని, చండీహోమము అనగా దుర్గా సప్తశతి అనే 700 శ్లోకమలచే హోమము చేయడము. ఇందు 700 శ్లోకమలు 3 చరిత్రలుగా విభజించి ఉన్నాయి.
. ప్రధమ చరిత్ర మహాకాళీస్వరూపముగా, మధ్యమ చరిత్ర మహాలక్ష్మీ స్వరూపముగా,  ఉత్తమ చరిత్ర మహా సరస్వతీ స్వరూపముగా చెప్పబడి ఉన్నది.
చండీసమదైవం నాస్తి అన్ని పురాణాలు చెపుతున్నాయి. కలియుగములో సమస్త బాధలు, అతివృష్టి. అనావృష్టి, శత్రునివారణ చేయటానికి కుటుంబమును సర్వసౌభాగ్యములతో వృధి చేయడానికి మహాకాళి. మహాలక్ష్మీ, మహాసరస్వతి అయిన చండీపరాదేవత అనుగ్రహము చాలా అవసరము. అమ్మవారి ప్రీతిపాత్రమైన పౌర్ణమి తిధియందు త్రిదేవిసహీత, త్రిశక్తి అయిన చండిపరాదేవతను ఆరాధించి చండిహోమము ఎవరైతే జరిపించుకుంటారో ఆ కుటుంబమంతా పుత్ర పౌత్రాదులతో సుఖముగా జీవిస్తారని శ్రీ డేవి భాగవతమందు చెప్పబడినది.

 సృష్టి స్థితి లయములు గావించున్న ఆ మహా మాయను ఎవరు ఉపాసించు చున్నారో, వారు జనన మరణ రూపమగు సంసారము నుండి తరించు చున్నారని, మోక్షమును బొందుచున్నారని నృసింహతాపిన్యుపనిషత్తు
తెలియ జెప్పుచున్నది. ఆ శక్తిని భజించినవాడు మృత్యువును జయించి మోక్షమును బొందును.
త్వం వైష్ణవీ  శక్తి రనంత వీర్యా విశ్వస్య బీజం పరమాzపి మాయా సమ్మోహితం దేవి సమస్త మే తత్...
ఈ లోక మంతయూ మాయా శక్తి చే సమ్మోహిత మగుచున్నది.
ఒకప్పుడు దేవిని దేవత లెల్లరు “అమ్మా నీ వెవరు? అని అడుగగా
“నేను బ్రహ్మ స్వరూపిణిని, నా వల్లనే ప్రకృతి పురుషులు పుట్టుచున్నారు, జగమును జనించు చున్నది” ... అని చెప్పినది.
 సర్వే వై దేవా దేవీ ముపతస్థుః కాసిత్వం దేవీ సా zబ్రవీ దహం  బ్రహ్మ రూపిణీ మత్తః ప్రకృతి పురుషాత్మకం జగత్.
అట్లే మాయ, బ్రహ్మ రూపిణి, విశ్వ మోహిని, ఆత్మ స్వరూపిణి అని భువనేశ్వరి ఉపనిషత్తు చెప్పుచున్నది.
  “ స్వాత్మ్యైవ  లలితా .... అని భావనోపనిషత్తు చెప్పు చున్నది
హ్రీం బీజము పర బ్రహ్మ స్వరూపమని, మోక్షప్రదమని దేవీ భాగవతము చెప్పు చున్నది.
చితి స్తత్పదలక్ష్యార్దా చిదేకరస రూపిణి ... అని బ్రహ్మాండ పురాణము అమ్మను కొని యాడినది.
ఇట్లు అష్టాదశ పురాణములు, ఉప పురాణములు,  స్మృతులు దేవిని పర బ్రహ్మమని ప్రతి పాదించినవి.

శక్త్యక్ష రాణి  శేషాణి హ్రీం కార ఉభాయాత్మకః .. అని 
ఇతర బీజాక్షరములు కేవలము  శక్తికి సంబంధించినవి వనియు, మాయా బీజమైన హ్రీం కారము మాత్రము ఉభాయాత్మక మైన శివ శక్త్యాత్మక బీజమని బ్రహ్మాండ పురాణము చెప్పు చున్నది.
హ్రీం హ్రీమితి ప్రతి దినం జపతాం జనానాం,
కిం నామ దుర్లభమిహ త్రిపురాధివాసే.
త్రిపురముల యందు వసించు ఓ .. అమ్మా హ్రీం హ్రీం అని నీ బీజ మంత్రమును జపించు వారికీలోకమున దుర్లభమైన దేమియునూ లేదు. సకల కల్యాణ భాజనమైనదీ హ్రీంకారము. శ్రీదేవీ ప్రణవము  హ్రీంకారము.
(సూచన:- ఉపదేశము లేనిదే మంత్రములను ఉపాసన చేయకూడదు.)
ఓం శ్రీ గురుః  పరమ కారణ భూతాశక్తిః  ... అని భావనోపనిషత్తు చెప్పు చున్నది.
శ్రీవిద్యా పూర్ణ దీక్ష నొసగిన శ్రీ గురువులు  శ్రీ పరాదేవి స్వరూపులే. శ్రీ గురుదేవుల అనుగ్రహము చేత మహా వాక్య ప్రాప్తి, ( శ్రీవిద్యా పూర్ణ దీక్ష యందు మహా వాక్యములతో గూడిన మహా పాదుకలను ఇచ్చెదరు.) 
దాని వలన బ్రహ్మాత్మైక్య సిద్ది లభించు చున్నందున శ్రీ గురువులే పరమ కారణమైన పరా శక్తి స్వరూపులని,       శ్రీ గురువులకు శ్రీ మాతకు అభేదము అని చెప్పు చున్నది. అట్టి శ్రీ గురుదేవులకు నమస్కరిస్తూ

మీ
భాస్కరానందనాధ (దీక్షా నామము)
కామరాజుగడ్డ రామచంద్రరావు



Tuesday 19 June 2012

మహావిద్య


మహావిద్య 

ఉపాసనా కాండయందు గల విద్యలలో సర్వ రక్షాకర విద్య అయిన మహావిద్య పరమో త్క్రుష్ట మైనది.
మహావిద్య పారాయణమునకు పాదుకాంత దీక్షితులకు మాత్రమే అధికారము కలదు.
మహావిద్య పారాయణము సర్వ సౌఖ్య ప్రదాయిని.  ధర్మ, అర్థ , కామా మోక్ష ఫల ప్రదమని, సంతతిని, సౌభాగ్యములను ఇచ్చునని , సర్వ పాపములను హరించునని, మాయను తొలగించి జ్ఞాన మోసగే బ్రహ్మ విద్య అని, మోక్ష విద్య అని శ్రీ రేణుకా తంత్రమునందు వివరింపబడినది.

500  మహా మంత్రములతో ఈ మంత్ర రాజము మాలా మంత్రమై, మహావిద్యగా నొప్పారుచున్నది.
ఇందలి మంత్రములు :-
౧. సర్వ శత్రు వినాశకర మంత్రములు.
౨. సర్వ దేవతా దిగ్బంధః మంత్రములు.
౩. సర్వ అస్త్ర  దిగ్బంధః మంత్రములు
౪. త్రిమూర్తి , త్రిలోక దిగ్బంధః మంత్రములు
౫. ఇంద్రాది అష్ట దిక్పాలక దేవతా దిగ్బంధః మంత్రములు.
౬. నవగ్రహాది మంత్రములు.
౭. సర్ప సూక్త మంత్రములు.
౮. సర్వ రాక్షస దిగ్బంధః మంత్రములు.
౧౦. రుద్ర, శక్తి దిగ్బంధః మంత్రములు.
౧౧. సర్వ రక్షాకర మంత్రములు.
౧౨. దూర దృష్టి , దూర శ్రవణ, స్తంభన మంత్రములు.
౧౩. అష్టాదశ పీఠ మంత్రములు.
౧౪, శివ, రామ,కృష్ణ , వాసుదేవ, హయగ్రీవ, నృసింహ, సుదర్శన, శ్రీమన్నారాయణ, గరుడ, సర్ప, దక్షిణామూర్తి దత్తాత్రేయ, కుబేర, లక్ష్మీ, దుర్గ, చండీ, చాముండీ, బగలా, వైష్ణవి, సరస్వతి, గాయత్రీ, వనదుర్గ దేవతా  మంత్రములు.
౧౫. యక్షిణి, కుబేర, సూర్య, ఆదిత్య, భాస్కర, హనుమద్గణేశాది మంత్రములు.
౧౬. మంత్ర గాయత్రీ, భద్రకాళి, మహాకాళి, మహా ప్రత్యింగిరా మంత్రములు.
౧౭. శాంతి మంత్రములు, మృత్యుంజయ మంత్రములు.
౧౮. సర్వ రక్షా కర  మంత్రములు.
౧౯. రోగ, భయ, దుర్గతి, దుర్దశ నాశ మంత్రములు.
౨౦.  ప్రతి కూల వినాశక , అనుకూల మంత్రములు.
౨౧. అభీష్ట ఫలదాయక , జ్వర హర, శూల హర, సర్వ గ్రహ నివారక, శత్రు వినాశకర మంత్రములు.
౧౨. యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుషాది మంత్రములు.
౧౩. శివ, విష్ణు ,దేవీ మంత్రములు.
౧౪. అఘోర మంత్రములు.
౧౫. బాల, నవాక్షరి, పంచదశాక్షరి, షోడశి, మహా షోడశి, మహా మంత్రములు.
౧౬. మహా జ్వరహర, వశీకరణ మంత్రములు.
౧౭. దశ మహా విద్య మంత్రములు.

ఈ మహావిద్య రుద్రయామళ తంత్రార్గత మైన, కల్ప కౌస్తుభము నందు రహస్యముగా చెప్ప బడినది.
ఈ మహా విద్యను ఉపశించే సాధకులను మహోపాసకులు  అని అందురు. నిష్కామంగా, ధర్మబద్ధముగా చేయుటచే ఉపాసకున్ని రక్షిస్తూ, మోక్ష మార్గము వైపు  నడిపించేది ఈ మహావిద్య.
వేద మంత్రములతో కూడినదైన ఈ మంత్ర రాజమును పారాయణ చేయుటకు సంప్రదాయ పూర్ణ దీక్షా పరులు మాత్రమే అర్హులు.

అట్టి ఈ మహావిద్యను పారాయణ చేయుటకు గత పది సంసంవత్సరములుగా అర్హత కలిగించి, అనుగ్రహించిన ఆ పరదేవతకు అంజలి ఘటిస్తూ,
అనేన మయా కృతేన పూర్వాంగోత్తరాంగ సహిత శ్రీ మహావిద్యా పంచశతీ మంత్ర రాజ మాలామంత్ర పారాయణేన,  శ్రీ మహావిద్యా వనదుర్గేశ్వరీ స్వరూపిణీ శ్రీ మహా కామేశ్వర్యంబా, ప్రతాప భారతీ ప్రియతాం, ఇతి జలధారా పూర్వకం శ్రీ పరదేవతా కరారవిందే పారాయణం సమర్ప్య...  
ఓం శాంతిః ఓం శాంతిః ఓం శాంతిః ఓం శాంతిః


న గురోరధికం, న గురోరధికం, న గురోరధికం, న గురోరధికం
శివ శాసనతః  శివ శాసనతః  శివ శాసనతః  శివ శాసనతః 

మీ
భాస్కరానంద నాథ
మహావిద్యోపాసకులు, మహాపాదుకాంత శ్రీవిద్యాపూర్ణ దీక్షాపరులు
 (కామరాజుగడ్డ రామచంద్రరావు)

Monday 11 June 2012

శ్రీ లలితా త్రిపుర సుందరి


 శ్రీ లలితా త్రిపుర సుందరి
భక్తుడు ధాన్యం చేసుకోవడానికి ఒక రూపం కల్పించబడ్డది. మరి ఆ రూపానికో నామం, ఆ నామరూపాలకో నివాస స్థానం. ఇవన్నీ ఎందుకంటే భక్తుడు భగవంతున్ని కూడా తనతో పోల్చుకొంటాడు.
తనలాగే నామరూపాలు నివాసం ఉంటాయనుకొంటాడు. తన లాగే వేష భాషలుంటాయని తలపోస్తాడు.
తన లాగే భగవంతునికి కూడా సంసారం వున్నదని అనుకొంటాడు. తనకు ఇష్టమైన పదార్థాలు అన్నీ భగవంతుడికి కూడా ప్రీతికరమైనవిగా భావిస్తాడు.
 ప్రతి జీవీ భగవంతుడు తన లాగే వుంటాడని నమ్ముతుంది. ఒక శునకాన్ని భగవంతుడు ఎలా వుంటాడని ప్రశ్నిస్తే, తన లాగే శునక రూపం లో వుంటాడని చెబుతుంది.

మొదట్లో ఒక నామాన్ని, రూపాన్ని, ఒక స్థానాన్ని తన అభీష్టానికి అనుగుణంగా భావించుకొని ధ్యానం చేయవచ్చు. కానీ అదే శాశ్వతంగా చేసుకోకూడదు. భగవానుని పై వున్న భక్తిని అనుసరించి ధ్యానాన్ని అభ్యసించాలి. అంటే చూసే ప్రతి వస్తువు ను భగవత్స్వరూపంగా ధ్యానం చేయాలి. అన్ని రూపాలలో, అన్ని దేవతలలో, అన్ని స్థానాలలో మన  ఇష్ట దైవాన్ని చూడగలగాలి. అన్ని రూపాలూ ఒకటేనని గాడంగా నమ్మాలి. తత్వం ఒకటేనని నమ్మిక రావాలి.

ఒకే బంగారం వివిధ ఆభరణాలలో వున్నట్లు, ఒకే పర బ్రహ్మం వివిధ రూపాలలో కొలువై వున్నది.
దైవం ఒక్కడేనని, అనేక నామరూపాలు భక్తుల సౌకర్యము కోసమే ధరిస్తాడని, వాటిల్లో ఏ నామరూపాలతో ధ్యానించినా ఆ పరమాత్మ కరుణిస్తాడని తెలుసుకోవాలి. శైవులు లింగాకారాన్ని ప్రార్ధిస్తారు.  అదే వైష్ణవులు నవరత్న ఖచితమైన ఆభరణాలతో అలంకరించిన శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తారు. ఇరువురిని ఒక్కటిగా చూచి, కొలిచే వాడే యోగి. ఎందుకంటే ఆ ఇద్దరిలోనూ వున్న నిర్గుణ పరబ్రహ్మ తత్వాన్నే యోగి చూస్తాడుగనుక.  లింగ భేదాలు శబ్దాన్ని బట్టి కలిగాయే గాని, వస్తువును బట్టి గాదు. లింగ భేదం గాని, నామ రూపాలు గాని సగుణ బ్రహ్మనికే గాని నిర్గుణ పరబ్రహ్మానికి కాదు.
కాబట్టి ఎవరికి ఏ రూపం, ఏ నామం ప్రియంగా వుంటుందో, అతడా నామరూపాలలో ఆ పరబ్రహ్మమును కోలుచుకోవచ్చు.  ఆ స్థాయికి భక్తుడు ఎదగాలి. తన భక్తి శ్రద్ధలను బట్టి, విశ్వాసమును బట్టి తను కొలిచే రూపములోకి ఆ పరబ్రహ్మ స్వరూపము ఆకర్షించబడును. భక్తి శ్రద్ధలతో ఏ దేవుణ్ణి, ఏ దేవతను కొలిచినా, చివరకు రాయి, రప్ప, చెట్టు, పుట్ట దేనినైనా సరే, భగవంతుడు పలికి తీరుతాడు. నమ్మకం ముఖ్యం.

ఆకారం వున్న వస్తువులన్నీ ఆ మహా ప్రకృతిచే సృష్టించబడ్డవే. పుట్టిన వాళ్ళందరూ కర్మ బద్దులే. కాబట్టి త్రిమూర్తులు కూడా ఆ ప్రకృతికి పుత్రులేనని తెలుస్తుంది. అందువల్లనే శక్తిని ఉపాసించేవారిని యోగులన్నారు. మార్గం  ఏదైనా, పరిపక్వత చెందితే గానీ భగవదనుగ్రహం కలగదు.  కాబట్టి ఏ దేవతను ఉపాసించినా ఆ దేవతకన్నా భిన్నమైనదేదీ లేదన్న భావనతో ఉపాసించాలి. అప్పుడే పూర్ణ ఫలం లభిస్తుంది. భక్తి జ్ఞాన వైరాగ్యములు లేకుండా, ఏ ఉపాసన చేసినా అదంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది.

నిర్గుణ పర బ్రహ్మం తప్ప మిగిలిన వారంతా మాయాశక్తి అయిన ప్రకృతి చేత సృష్టి౦చబడ్డ వాళ్ళే. కాబట్టి ముందుగా మూల ప్రకృతిని, ఆ పర దేవతను ఉపాసించి, ఆమె అనుగ్రహానికి పాత్రులై, ఆ పరమాత్మ కరుణకు పాత్రులు కావాలన్నదే శ్రీవిద్యోపాసకుల భావం.

మంత్రమంటే శ్రీచక్రమని, శ్రీచక్రములో సర్వ దేవతలుంటారని, ఒక్క పరబ్రహ్మం తప్ప మిగిలిన దేవతలంతా
కూడా త్రిమూర్తులతో సహా ఆ దేవిని సేవిస్తూ వుంటారని, త్రిమూర్తులకు కూడా ఆమే తల్లి యని,  శ్రీచక్రములో ముక్కోటి దేవతలను భావించుకుంటూ, అందులోని బిందు స్థానాన్ని ఆ పరదేవతగా ధ్యానిస్తూ, శ్రీ శంకరభగవత్పాదుల చే పరిష్కరించబడి వేదోక్త విధి విధానములతో చేయబడే శ్రీ విద్యా తంత్రమును, దక్షిణాచారమని   అంటారు. కరచరణాదులతో గూడిన సగుణ బ్రహ్మాన్ని, లేదా తద్దేవతా యంత్రములను, షోడశోపచారములతో, ధూప,దీప,నైవేద్యములతో  పూజించడాన్ని బహిర్యాగమందురు.

మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ రూపమైన ఆ శ్రీమాతను, ఆ పరదేవతను ఆరాధించి కొలవడమే శ్రీవిద్యోపాసన. త్రిమూర్తులను త్రిశక్తులను సృష్టించిన శ్రీమాత ఆమె. సర్వ సృష్టికి మూలాధారమైన ఆ ఆదిశక్తి మన తల్లి.  ఒకప్పుడు ఆమెను దేవతలందరూ అమ్మా నీవు ఎవరు ? అని అడుగగా,
నేను బ్రహ్మస్వరూపిణిని, నా వలననే ప్రకృతి పురుషులు పుట్టుచున్నారు, జగమును జనించుచున్నది ...అని చెప్పినది. అందుకే ఆమె బ్రహ్మ విష్ణు శివాత్మికా .. అని, శివ శక్త్యైక్య రూపిణీ లలితాంబికా, .. అని,  పిలవబడుచున్నది. మూడు గుణములకు ప్రతి రూపమైన  త్రిమూర్తులకు తల్లియై, వారికి కూడా శక్తిని ప్రసాదిస్తూ త్రికోణా౦తర దీపికా గా తన ప్రభలను ప్రభవిస్తూ వున్నది. బ్రహ్మాండము లన్నింటికీ శక్తిని ఇస్తూ, సమస్త గ్రహములను నిర్దిష్ట కక్ష్యలో పరిభ్రమణ చేయుస్తూ, అవి పడిపోకుండా నిలుపుదల చేసిన మహాశక్తి  మన తల్లియే. మన పెద్దమ్మే. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ.

ప్రకృతితో కలిసి ఉండకపోయినట్లయితే పరమేశ్వరుడు కూడా దేహాన్ని ధరించలేడు. రాగితో కలవనిదే బంగారము ఆభరణము కాదు. కాబట్టి ధర్మ రక్షణ కోసం నిర్గుణ పరబ్రహ్మం, సతితో కలసి  సగుణాన్ని స్వీకరిస్తాడు. అప్పడు రూపం ఏర్పడుతుంది. తన మహాత్త్వాన్ని లోకానికి చాటి చెప్తూ అధర్మాన్ని సంపూర్ణంగా నిర్మూలించి అటు పైన ఆ రూపాన్ని వదిలేస్తాడు.  ఈ రూపాన్నే మనము  అర్చనా పరంగా ఆరాధిస్తాము. అటువంటి రూపాలనే మనము అవతరాలని అంటూవుంటాం. 

దేవతల యొక్క శక్తి వాని మంత్రములయందు, మంత్రముల యొక్క శక్తి వాని బీజముల యందు నిక్షిప్తమైయున్నట్లు, ఆయా దేవతల తత్వమంతయు సంక్షిప్తముగా ఇమిడియుండుటచేత ఆయా దేవతల మంత్రములు ఆయా దేవతల సూక్ష్మ రూపమని అందురు. ఇట్టి సూక్ష్మరూపమును జపాది రూపమున మానసికముగా, భావనాపరంగా  చేయు క్రియను  అంతర్యాగము  అని అందురు.
మానసికంగా చేసే ప్రతి పూజా అంతర్యాగము  అగును. 
బాహ్యముగా చేసే శ్రీచక్రార్చనను అంతర్ముఖమున షట్చక్ర భేదనముచే, బ్రహ్మగ్రంధి, విష్ణు గ్రంధి, రుద్రగ్రంధిని చేధించి సహస్రారమును  చేరే యాగమును అంతర్యాగము  అని అందురు.

శ్రీ శంకర భగవత్పాదులకు గురువైన శ్రీ గౌడపాదాచార్యులు విరచించిన శ్రీ విద్యా సూత్రముల గురించి,
మానవ శరీరములోని షట్చక్రములు అందలి దేవతలు, శ్రీచక్రమునకు గల ఐక్యత, సంబంధము గురించి,
కుండలినీశక్తిని గురించి, మరో టపాలో తెలుసుకొందాము.
మంత్ర, తంత్ర, యంత్ర, శాస్త్రములను, పాఠములను  గురు ముఖతః తెలుసుకోవలెను, 
గావున ఇచట చర్చించుట లేదు.................. సశేషం.

నమస్కారములతో

మీ
భాస్కరానందనాథ
(కామరాజుగడ్డ రామచంద్రరావు)
9959022941